Padi Kaushik Reddy: జూబ్లిహిల్స్, దుబాయ్‌లో రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెబితే భార్య ఇంటికి కూడా రానివ్వదు: పాడి కౌశిక్ రెడ్డి
- పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఊరుకునేది లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇరికించేవారన్న పాడి కౌశిక్ రెడ్డి
- రేవ్ పార్టీ అయితే పిల్లలు, ముసలివాళ్లు ఉంటారా? అని ప్రశ్న
సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఏమేం చేశాడో చెబితే ఆయనను భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"నేను రేవంత్ రెడ్డి గారికి చెబుతున్నాను... మీరు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే... నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో... జూబ్లిహిల్స్‌లో ఏం చేశావో... దుబాయ్‌లో ఏం చేశావో... బెంగళూరులో ఏం చేశావో... చెన్నైలో ఏం చేశావో... అన్నీ మేం చెబితే నీ అర్ధాంగి, నీ బిడ్డ కూడా ఇంటికి రానివ్వరు" అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఎటు తీసుకువెళుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. తనను కూడా ట్రాప్ చేసి, డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో కేటీఆర్ ఉంటే కనుక డ్రగ్స్ కేసు పెట్టి ఇరికించాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించలేదని సీఎం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పోలీసులను తిట్టారన్నారు. పోలీసులకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి తన కారులో పెట్టాలని సూచించారని, ఈ విషయాన్ని పోలీసులే తనకు చెప్పారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలన్న కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ను స్వీకరించారు. వాళ్లు ఎక్కడకు రమ్మంటే తాము అక్కడకే వస్తామన్నారు. రేవ్ పార్టీ అంటే పిల్లలు, ముసలివాళ్లు ఉంటారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరు కాంగ్రెస్ కార్యకర్తల్లా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లా ఉందని విమర్శించారు.
ఏఐ ద్వారా వాయిస్‌లో మార్పు చేసి, వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మేం డ్రగ్స్ టెస్టులకు సిద్ధం... కాంగ్రెస్ నేతలు కూడా రావాలి... లేదంటే వారు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని, కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.