Congress: కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం ఆగ్రహం
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మండిపాటు
- ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
- 1,600 పేజీలతో అధికారిక ప్రతిస్పందన విడుదల చేసిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తుండడంపై భారత ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ప్రతికూల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ విమర్శించింది. హస్తం పార్టీ వాదనను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ప్రధానంగా హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 8న అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ దాదాపు 2 గంటలపాటు చాలా నెమ్మదించాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. హర్యానా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగలేదని, ప్రతీ చర్య కూడా కాంగ్రెస్ అభ్యర్థులు లేదా ఏజెంట్ల పర్యవేక్షణలోనే జరిగినట్టు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం మొత్తం 1,600 పేజీలతో కూడిన అధికారిక ప్రతిస్పందనను విడుదల చేసింది.
ఓట్లు వేసేటప్పుడు, కౌంటింగ్ సమయంలో నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. బాధ్యతా రహితమైన ఈ ఆరోపణలు ప్రజల్లో అశాంతి, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయని, గందరగోళానికి దారితీస్తాయని ఈసీ పేర్కొంది. అనవసరమైన ఈ తరహా ఫిర్యాదుల ధోరణిని అరికట్టడానికి దృఢమైన, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరింది. ఇక హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా కాంగ్రెస్ వాదనలను ఖండించారు.
కాగా హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఆరంభంలో భారీ లీడ్ సాధించినప్పటికీ ఆ తర్వాత బీజేపీ పుంజుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగాయంటూ అక్టోబరు 8-10 మధ్య, తిరిగి అక్టోబర్ 14న కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో విధానపరమైన అక్రమాల జరిగాయని పేర్కొన్నారు.