Chandrababu: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

CM Chandrababu wished Diwali to all Telugu people
  • ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షించిన సీఎం
  • ‘దీపం 2.0’ పథకం అమలుతో ఈ దీపావళిని మరింత కాంతివంతం చేస్తున్నామని వ్యాఖ్య
  • దీపం పథకానికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారని వెల్లడి
చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పర్వదినాన్ని జరుపుకోబోతున్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది అని ప్రస్తావించారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారదోలినట్టుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకం అమలుతో ఈ దీపావళిని మరింత కాంతివంతం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు గుర్తుచేశారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే ‘దీపం 2.0’ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇది సంతోషం కలిగించే విషయమని అన్నారు. ‘‘మీ నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు తన సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Chandrababu
Andhra Pradesh
Telangana
Diwali 2024

More Telugu News