Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ ఎంత ధర పలుకుతాడో అంచనా వేసిన ఆకాశ్ చోప్రా
- రూ.25-30 కోట్ల భారీ ధర పలకవచ్చన్న టీమిండియా మాజీ ఆటగాడు
- ఆర్సీబీ, లక్నో మొదలుకొని గుజరాత్, రాజస్థాన్ వరకు చాలా జట్లకు రిషబ్ పంత్ అవసరమని విశ్లేషణ
- ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆర్టీఎం కార్డు ద్వారా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉందని అంచనా
ఐపీఎల్ 2025కు రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న ప్రకటించనున్నాయి. చాలా మంది కీలక ఆటగాళ్లను జట్లు అట్టిపెట్టుకోనున్నాయి. అయితే పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్ల నుంచి విడుదలవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. పంత్‌ను రిటెయిన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తున్నప్పటికీ అతడు మాత్రం వేలంలోకి వచ్చే అవకాశం ఉందని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి.
రిషబ్ పంత్ వేలంలో అందుబాటులో ఉండవచ్చని తాను కూడా విన్నానని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా చెప్పాడు. ‘‘ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కీపర్, ఒక బ్యాటర్, బహుశా ఒక కెప్టెన్ కావాలి. పంజాబ్‌కు కూడా కెప్టెన్ కావాలి. ఢిల్లీ జట్టు కూడా తిరిగి అతడిని కోరుకుంటుంది. ఆ జట్టుకు ఆర్‌టీఎం కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా కావాలి. సీఎస్కేకి కూడా అవసరం. ఇషాన్ కిషన్‌ను రిలీజ్ చేస్తే ముంబై జట్టుకు కూడా రిషబ్ పంత్ కావాలి. నికోలస్ పూరన్‌ని రిటెయిన్ చేసుకున్నప్పటికీ పంత్‌పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఎందుకు ఆసక్తి చూపదు? రాజస్థాన్, గుజరాత్‌తో పాటు అన్ని జట్లు అతడిని కోరుకుంటాయి. రాజస్థాన్, గుజరాత్ జట్లకు కీపర్లు లేరు. మొత్తంగా రిషబ్ పంత్‌కు చాలా డబ్బు వస్తుంది. అతడు రూ.25-30 కోట్ల వరకు ధర పలుకుతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.
టీ20ల్లో రిషబ్ పంత్ పెద్దగా పరుగులు చేయలేదని చాలా మంది అంటున్నారని, ఐపీఎల్‌లో ఒకే ఒక్క సీజన్‌లో మంచిగా ఆడాడని చెబుతున్నారని, కానీ అతడు ఐపీఎల్ వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని రాతపూర్వకంగా చెప్పగలనని అన్నాడు.