Raja Singh: ఆ టపాసులు కాల్చకండి: ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి
- లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులు కాల్చవద్దని విజ్ఞప్తి
- ఇది ఎప్పుడో జరిగిన పెద్ద కుట్ర... ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడి
- వచ్చే ఏడాది నాటికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న క్రాకర్స్ కాల్చకుండా చేద్దామని పిలుపు
దీపావళి పండుగ సమయంలో మనం కాల్చే టపాకాయల్లో లక్ష్మీ బొమ్మ ఉంటే కాల్చవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళి అంటేనే మనం లక్ష్మీదేవిని పూజిస్తామని... కానీ అదే లక్ష్మీదేవి ఉన్న బాంబును పేలుస్తుంటామని... ఇది సరికాదన్నారు. ఇది ఎప్పుడో జరిగిన ఓ పెద్ద కుట్ర అని... అది ఇప్పటికీ తెలియకుండా కొనసాగుతోందన్నారు. మనమంతా కలిసిమెలిసి... మన లక్ష్మీదేవి ఉన్న క్రాకర్స్‌ను మనం ఎవరమూ కొనవద్దని... వచ్చే దీపావళి నాటికి ప్రతి ఒక్కరిలో ఈ సంకల్పం తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
దీపావళి పండుగ సందర్భంగా మనమంతా టపాకాయలు కాలుస్తామని, వీటిని కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లలు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన ఉండాలన్నారు. ఏ క్రాకర్‌లో ఎలాంటి మందు ఉంటుందో చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి పెద్దలు దగ్గర ఉండి కాల్పించాలన్నారు.
గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుందన్నారు. ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు, మరింత సంతోషం, శ్రేయస్సును ఈ దీపావళి తీసుకువస్తుందన్నారు. కొత్త ఆలోచనలను, ఆదర్శాలను ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానదీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి మనకు అందిస్తుందన్నారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.