Firecrackers Tragedy: ఏపీలో వేర్వేరు చోట్ల బాణసంచా ప్రమాదాలు... ముగ్గురి మృతి

Three dies in AP due to firecrackers blasts

  • ఏలూరులో రోడ్డుపై గుంత కారణంగా అదుపుతప్పిన బైక్
  • రోడ్డుపై పడిపోయిన టపాసులు... పేలడంతో అగ్నిప్రమాదం
  • సజీవదహనమైన వ్యక్తి
  • నిన్న బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు
  • ఇద్దరు మహిళల దుర్మరణం

ఏపీలో రెండు చోట్ల బాణసంచా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరులో జరిగిన  ఓ ఘటనలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బైక్ పై టపాసులు తీసుకెళుతుండగా... గంగానమ్మ ఆలయం వద్ద రోడ్డుపై గుంత రావడంతో బండి అదుపుతప్పింది. 

ఉల్లిపాయ బాంబులతో ఉన్న సంచి రోడ్డుపై పడి, టపాసులు పేలడంతో ఆ వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మృతుడి దేహం పేలుడు ధాటికి ఛిద్రమైంది. మృతుడిని సుధాకర్ అనే వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక, నిన్న సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో, బాణసంచా తయారీ కేంద్రం అగ్నిప్రమాదానికి గురైంది. వి.శ్రీవల్లి (42), జి.సునీత (35) అనే మహిళలు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో 9 మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News