Perambur: దీపావళి రోజున కూడా ఈ ఊర్లో బాణసంచా కాల్చరు!

This Tamil Nadu village bans fireworks even on Diwali day

  • బాణసంచా తయారీకి కేరాఫ్ అడ్రస్ గా తమిళనాడు
  • ఈ ఏడాది రూ.6 వేల కోట్ల బిజినెస్
  • అలాంటి రాష్ట్రంలో ఓ గ్రామంలో బాణసంచాపై నిషేధం
  • కారణం... కబోది పక్షులే!

తమిళనాడు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఆ రాష్ట్రం బాణసంచా, టపాసులకు ప్రసిద్ధి చెందిన విషయం తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి ప్రాంతం బాణసంచా తయారీకి ముఖ్యకేంద్రంగా విలసిల్లుతోంది. దేశంలో అన్ని ప్రాంతాలకు ఇక్కడ్నించే బాణసంచా సరఫరా అవుతుంది. అలాంటి తమిళనాడు రాష్ట్రంలోని ఓ గ్రామంలో అసలు బాణసంచానే కాల్చరంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 

ఆ ఊరి పేరు పెరంబూరు. మైలదుత్తురై జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో దీపావళికి కూడా బాణసంచా కాల్చడం నిషిద్ధం. అందుకు కారణం ఉంది. పెరంబూరు గ్రామంలోని ఓ పెద్ద మర్రిచెట్టుకు వేళ్లాడుతూ వందలాది కబోది పక్షులు ఉంటాయి. ఆ మహా మర్రిచెట్టును గ్రామస్తులు భగవాన్ మునీశ్వరన్ కు చెందినదిగా భావిస్తారు. 

దాంతో, ఆ చెట్టుకు, ఆ చెట్టు పరిసర ప్రాంతాలకు ఆధ్యాత్మిక గుర్తింపు వచ్చింది. ఆ మర్రి చెట్టుపై ఉండే కబోది పక్షులను కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే, ఆ చెట్టు జోలికి, ఆ చెట్టుపై ఆవాసం ఉండే కబోది పక్షుల జోలికి ఎవరూ వెళ్లరు. బాణసంచా కాల్చితే ఆ పేలుళ్లకు పక్షులు భయపడి వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో గ్రామస్తులు టపాసుల జోలికి వెళ్లరు. 

ఇతర గ్రామాల వారు పెరంబూరు గ్రామస్తులతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే, వారికి కూడా మర్రిచెట్టు మహత్మ్యం గురించి, ఆ చెట్టుపై ఉండే కబోది పక్షుల గురించి, బాణసంచాపై నిషేధం ఉన్న సంగతి ఈ గ్రామస్తులు చెబుతారు. పెళ్లి, ఇతర వేడుకల్లో బాణసంచా కాల్చడం కుదరదన్న విషయాన్ని వారికి వివరిస్తారు. 

పెరంబూరులో దాదాపు 1,500 మంది నివసిస్తుంటారు. వారిలో చాలామంది రైతులే. వారి పర్యావరణ స్పృహను ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు సైతం ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News