Indian Railways: రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్

Railways reducing the advance reservation period from 120 days to 60 days
  • అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధి 120 నుంచి 60 రోజులకు తగ్గింపు
  • నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన
  • నిజమైన రైల్వే ప్రయాణీకులను ప్రోత్సహించేందుకు మార్పు
రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూ అక్టోబర్ 16న ఇండియన్ రైల్వేస్ ఒక సర్క్యూలర్‌‌ విడుదల చేసింది. నిజమైన రైల్వే ప్రయాణికులను ప్రోత్సహించడం, పెరిగిపోతున్న ‘నో టికెట్ ట్రెండ్’ను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పుని తీసుకొచ్చినట్టు తెలిపింది.

కాగా 61 నుంచి 120 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటున్న టికెట్లలో దాదాపు 21 శాతం టికెట్లు రద్దవుతున్నట్టు గుర్తించామని రైల్వేస్ పేర్కొంది. అదనంగా మరో 5 శాతం మంది ప్రయాణం చేయకపోవడం లేదా టికెట్లు రద్దు చేసుకోవడం లేదని తెలిపింది. ‘నో టికెట్ ట్రెండ్’కు ఇది కూడా కారణమేనని పేర్కొంది. రద్దీ సీజన్‌లలో ప్రత్యేక రైళ్లను మరింత మెరుగైన ప్రణాళికతో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది.

కాగా ఈ కొత్త నిబంధన అమల్లోకి రావడంతో కేవలం 2 నెలల ముందు మాత్రమే రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారిపై కొత్త నిబంధన ప్రభావం ఉండదని పీఐబీ వెల్లడించింది. విదేశీ పర్యాటకుల విషయంలో 365 రోజుల ముందస్తు రిజర్వేషన్ పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం తెలిపింది. 

కాగా అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని చివరిసారిగా 2015లో సవరించి 60 నుంచి 120 రోజులకు పెంచారు. 1998 వరకు ఈ వ్యవధి 30 రోజుల కంటే తక్కువగా ఉండేది.
Indian Railways
Railways News
Railways News Rule

More Telugu News