Word of the Year 2024: ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’... అర్థం ఏమిటో తెలుసా?
- విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైఖరి అనే అర్థాలిస్తున్న పదం
- 2024లో ఎక్కువ మాట్లాడుతున్న పదాల్లో ఒకటని పేర్కొన్న కాలిన్స్ డిక్షనరీ
- యూకే సింగర్ చార్లీ ఆల్బమ్‌లో వాడిన పదానికి డిక్షనరీలో చోటు
కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’ (Brat) ఎంపికైంది. యూకేకి చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత చార్లీ ఎక్స్‌సీఎక్స్ ఈ పదాన్ని నిర్వచించారు. ‘బ్రాట్’ అనే పదం సింగర్ చార్లీ విడుదల చేసిన ఆరవ ఆల్బమ్ పేరు అని, విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైఖరి... అనే అర్థాలను ఇస్తుందని కాలిన్స్ డిక్షనరీ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్న కమలా హారిస్ మద్దతుదారులు ఈ పదాన్ని స్వీకరించి వినియోగిస్తున్నారని, దీంతో ‘బ్రాట్’ పదాన్ని కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైందని శుక్రవారం పేర్కొంది.
2024లో ఎక్కువగా మాట్లాతున్న పదాలలో ఒకటిగా బ్రాట్ పదం మారిందని కాలిన్స్ డిక్షనరీ తెలిపింది. విజయవంతమైన ఆల్బమ్ కంటే 'బ్రాట్' అనేది ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారిందని, ఈ పదం ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని తెలిపింది.
కాగా యూకేకి చెందిన 32 ఏళ్ల పాప్ స్టార్ చార్లీ ఎక్స్‌సీఎక్స్ అసలు పేరు షార్లెట్ ఎమ్మా ఐచిసన్. ఒక సాధారణ ఆకతాయి అమ్మాయి (Brat Girl) కొంచెం తలతిక్కగా, పార్టీలను ఇష్టపడే వ్యక్తి అని ఆమె 'బ్రాట్' అనే పదం గురించి వివరించారు. తమని తాము తెలివి తక్కువ వాళ్లమని భావించే వ్యక్తులు అని కూడా భావించవచ్చని, అయితే ఆ తర్వాత వారి వైఖరి మారవచ్చని, అది కూడా పార్టీల ద్వారానే అని ఆమె వివరించారు.
ఈ ఏడాది జులైలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను ‘బ్రాట్’ అని పేర్కొంటూ షార్లెట్ ఎమ్మా ట్వీట్ చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో కమలాను ప్రమోట్ చేయడంలో భాగంగా తన ఆల్బమ్‌లోని ‘365’ పాటను ఉపయోగించి ‘కమల ఈజ్ బ్రాట్’ పేరిట ఒక టిక్ టాక్ వీడియో రిలీజ్ చేసింది. షార్లెట్ ఎమ్మా విడుదల చేసిన ‘బ్రాట్’ ఆల్బమ్ యూకేలో మొదటి స్థానంలో, అమెరికాలో మూడవ స్థానంలో నిలిచింది.