Ponguleti Srinivas Reddy: రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారంపై స్పందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy on replacement of CM Revanth Reddy
  • రేవంత్ రెడ్డిని మార్చబోరన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి పూర్తి కాలం సీఎంగా ఉంటారని వ్యాఖ్య
  • సమస్యలు ఉంటే టీకప్పులో తుపానులా సమసిపోతాయని ఆశాభావం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. త్వరలో సీఎంను మారుస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిని మార్చబోరని వెల్లడించారు.

తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుందన్నారు. ఈ టర్మ్ రేవంత్ రెడ్డి పూర్తికాలం సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఒకవేళ తమ పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే టీ కప్పులో తుపానులా సమసిపోతాయన్నారు.

త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారుడికి అందిస్తామన్నారు. తొలుత సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తామని, ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై... ప్రారంభించిన ఇళ్లకు సహాయం చేస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాను పంపిస్తాయని తెలిపారు.

ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ళకు ఇసుకను ఉచితంగా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర గృహ నిర్మాణ స్కీంను అనుసరిస్తామని, ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం లోగో పెట్టుకోవడానికి తాము అంగీకరించినట్లు చెప్పారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరుపుతామన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజకు కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని ఆహ్వానిస్తామన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగకు ముందే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
Ponguleti Srinivas Reddy
Revanth Reddy
Congress
Telangana

More Telugu News