Sajjanar: కార్తీక మాసం... భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త

TGSRTC good news to Devotees

  • శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్టకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు
  • కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్న సజ్జనార్
  • అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్లు వెల్లడి

కార్తీక మాసం నేపథ్యంలో తెలంగాణ భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట వంటి దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్రత్యేకంగా బ‌స్సుల‌ను నడుపుతున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ పనితీరు, కార్తీక మాసంలో అధిక రద్దీ, శబరిమల యాత్రలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తదితర అంశాలపై ఆయన బస్ భవన్ నుంచి వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆది, సోమవారాల్లో శైవక్షేత్రాలు రద్దీగా ఉంటాయని, అందుకు అనుగుణంగా బస్సులను ప్రత్యేకంగా నడపాలని ఆదేశించారు.

ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఏపీలోని పంచారామాలకు కూడా ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. 

శబరిమలకు, శుభముహూర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News