Yogi Adityanath: యూపీ సీఎం యోగిని చంపేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్

Threat Message Asks Yogi Adityanath To Resign Adds Baba Siddique Warning
  • పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని వార్నింగ్
  • లేదంటే బాబా సిద్దిఖీ తరహాలోనే ప్రాణాలు కోల్పోతాడన్న ఆగంతకుడు
  • ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ కాల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. పది రోజుల్లోగా యోగి తన పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించాడు. లేదంటే బాబా సిద్దిఖీ లాగా యోగి ఆదిత్యనాథ్ కూడా చనిపోతాడని బెదిరించాడు. ఈమేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ సెంటర్ కు శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు ఫోన్ కాల్ ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి చేశారనే వివరాలు ఆరా తీస్తున్నారు. బెదిరింపులకు పాల్పడ్డ ఆగంతకుడిని పట్టుకునేందుకు దర్యాఫ్తు ప్రారంభించారు.

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత బాబా సిద్దిఖీ గత నెలలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాంద్రాలో కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్దిఖీ ఆఫీసు ముందు బాబా సిద్దిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్దిఖీ.. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ హత్యకు పదిహేను రోజుల ముందు సిద్దిఖీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కాగా, సల్మాన్ ఖాన్ కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్దిఖీని హత్య చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్ ను కూడా తుదముట్టిస్తామని బెదిరించింది. బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చాయి. తాజాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Yogi Adityanath
UP CM
Threat
Baba Siddique
Phone Call

More Telugu News