Revanth Reddy: బీసీ కులగణనపై తన నివాసంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
- కులగణనకు ప్రత్యేక కమిషన్ ఉండాలన్న ఆర్.కృష్ణయ్య
- కృష్ణయ్య విజ్ఞప్తిని పరిశీలించాలన్న తెలంగాణ హైకోర్టు
- హైకోర్టు ఆదేశాలపై మంత్రివర్గ సహచరులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి నేడు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణన అంశంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఈ సమావేశంలో చర్చించారు.
కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వేయాలంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరుతుండగా... కృష్ణయ్య విజ్ఞప్తిని వెంటనే పరిశీలించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారంలోగా దీనిపై నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సహచరులతో చర్చించారు. హైకోర్టు ఆదేశాలపై రేపటిలోగా చర్యలు తీసుకోవాలంటూ, ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన కులాల గణనకు తమ ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు.