Future Packing Dates: పుట్టగొడుగుల ప్యాకింగ్ డేట్లపై వివరణ ఇచ్చిన జొమాటో సీఈవో

Zomato CEO explains on futurer packing dates on Mushroom packs
  • హైదరాబాదులో హైపర్ ప్యూర్ పేరిట జొమాటో గోడౌన్
  • 90 పుట్టగొడుగుల ప్యాకెట్లపై తప్పుగా ప్యాకింగ్ డేట్లు
  • ఫ్యూచర్ ప్యాకింగ్ డేట్లు తప్పుగా ప్రింట్ అయ్యాయన్న గోయల్ 
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాదులో హైపర్ ప్యూర్ పేరిట గోడౌన్ కూడా నిర్వహిస్తోంది. అయితే ఈ గోడౌన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఆసక్తికర అంశం బయటపడింది. పుట్టగొడుగుల ప్యాకెట్లపై ప్యాకింగ్ తేదీలు తప్పుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  

అక్టోబరు 29వ తేదీన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూకట్ పల్లిలోని జొమాటో హైపర్ ప్యూర్ గోడౌన్ లో తనిఖీ చేయగా... ప్యాకింగ్ డేట్ అక్టోబరు 30 అని ఉన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ విధంగా ఫ్యూచర్ ప్యాకింగ్ డేట్ ఉన్న 90 పుట్టగొడుగుల ప్యాకెట్లను గుర్తించారు. వాటిపై ప్యాకింగ్ డేట్ 30-10-2024 అని ముద్రించి ఉంది.  

దీనిపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. టైపింగ్ లో పొరపాటు కారణంగానే ప్యాకింగ్ తేదీలు తప్పుగా ప్రింట్ అయ్యాయని వివరణ ఇచ్చారు. ఈ 90 బటన్ మష్రూమ్ ప్యాకెట్లను తమ గోడౌన్ బృందం ముందుగానే గుర్తించిందని, తమ అంతర్గత నాణ్యతా నియంత్రణ విభాగం ఆ ప్యాకెట్లను తిరస్కరించడం కూడా జరిగిందని తెలిపారు. 

ఎప్పుడూ ఇలా జరగదని, బహుశా విక్రయదారుల తప్పిదం అయ్యుంటుందని దీపిందర్ గోయల్ అభిప్రాయపడ్డారు. సదరు విక్రయదారును తమ డేటాబేస్ నుంచి తొలగించామని స్పష్టం చేశారు. తమ హైపర్ ప్యూర్ గోడౌన్లలో అంతర్గతంగా కఠినమైన మార్గదర్శకాలు పాటిస్తామని పేర్కొన్నారు. ఆహార నాణ్యత విషయంలో తాము ఎప్పుడూ రాజీపడబోమని అన్నారు. 

"మా సంస్థకు ఏ ప్లస్ రేటింగ్ ఉంది. మా గోడౌన్లలో కోట్ల రూపాయల విలువ చేసే సరుకు ఉంటుంది. కేవలం రూ.7,200 విలువ చేసే ఈ 90 ప్యాకెట్లపై మీడియాలో ఎందుకింత చర్చ జరుగుతోందో అర్థం కావడంలేదు. పైగా ఈ ప్యాకెట్లు వినియోగదారుల వద్దకు కూడా వెళ్లలేదు" అంటూ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. 
Future Packing Dates
Mushrooms
Zomato
Hyperpure
Hyderabad

More Telugu News