Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకొని బద్నాం చేయాలనుకుంటున్నారు: మంత్రి కోమటిరెడ్డి
- చిన్న చిన్న కారణాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శ
- ప్రక్షాళన అగిపోతే రాజకీయాల్లో కొనసాగడం వృథా అని వ్యాఖ్య
- మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణ
నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మూసీ ప్రక్షాళనను అన్యాయంగా అడ్డుకొని తమను బద్నాం చేయాలని చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విపక్షాలపై మండిపడ్డారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని, లేదంటే మూసీ మురికి ప్రజలను మరింత పీడిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఇక రాజకీయాల్లో కొనసాగడం వృథా అన్నారు.
కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆ నదుల నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే మూసీ పరీవాహక ప్రాంతంలోని నల్గొండ ప్రజలు మురికి నీటిని ఎందుకు వాడుకోవాలని నిలదీశారు. మూసీ ప్రక్షాళన కోసం అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాళ్లు, చేతులు వంకరలు పోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్పిపోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.