Revanth Reddy: చదువును నిర్లక్ష్యం చేయవద్దు... గంజాయి, డ్రగ్స్ వంటివి పెను ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy suggestions to Students

  • గత పదేళ్లలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్న ముఖ్యమంత్రి
  • త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న సీఎం
  • రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలతో ఉద్రేకానికి లోను కావొద్దని హితవు

విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయవద్దని... గంజాయి, డ్రగ్స్ వంటివి పెను ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు విద్యార్థులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత పదేళ్లలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజాప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువస్తుందని వెల్లడించారు. 

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చదువుకు దూరంగా ఉంటున్న విద్యార్థులను యువజన సంఘాలు పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ సంఖ్య తగ్గాలన్నారు. యువత దీనిని బాధ్యతగా తీసుకోవాలన్నారు. 

గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యసనాల బారిన పడవద్దని విద్యార్థులకు, యువతకు ఆయన సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి తప్ప... కొన్ని రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలతో ఉద్రేకానికి లోను కావొద్దన్నారు.

విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరమన్నారు. చదువుకున్న వారు ప్రయోజకులు అవుతారని... అయితే దానికి తోడు సామాజిక స్పృహ ఉంటే సేవ చేసి హీరోలుగా మారుతారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

  • Loading...

More Telugu News