FireCracker: బాణసంచా బాంబుపై అట్టపెట్టె బోర్లించి దానిపై కూర్చున్న యువకుడు.. పేలుడు.. వీడియో ఇదిగో!

Man Sits On Firecracker In Bet For New Vehicle Explosion Kills Him
  • కొత్త ఆటో కొనిస్తానంటే మద్యం మత్తులో ప్రాణాలతో చెలగాటం
  • బెంగళూరులో యువకుడి ప్రాణం తీసిన ఛాలెంజ్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మద్యం మత్తు.. కొత్త ఆటో వస్తుందనే ఆశతో ఓ యువకుడు ప్రాణాలతో చెలగాటం ఆడాడు. స్నేహితులతో వేసిన పందెంలో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బెంగళూరులో దీపావళి పండుగ నాటి రాత్రి జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగళూరుకు చెందిన శబరీష్ (32) దీపావళి నాడు స్నేహితులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి బార్ కు వెళ్లి మద్యం సేవించారు. ఆ మత్తులో బాణసంచా కాల్చే విషయంపై ఛాలెంజ్ లు విసురుకున్నారు. బాంబుపై అట్టపెట్టె బోర్లించి దానిపై కూర్చున్న వారికి కొత్త ఆటో కొనిస్తానని, ధైర్యం ఉన్నవారు ప్రయత్నించ వచ్చని మిత్రబృందంలో ఒకరు సవాల్ విసిరారు. దీనికి స్పందించిన శబరీష్.. ఛాలెంజ్ కు తాను సిద్ధమేనని చెప్పాడు.

బార్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బాంబు, కార్డ్ బోర్డ్ బాక్స్ తెప్పించారు. రోడ్డు మధ్యలో బాంబు పెట్టి అంటించారు. దానిపై అట్టపెట్టె బోర్లించి శబరీష్ కూర్చున్నాడు. లోపలున్న బాంబు పేలడంతో శబరీష్ ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే శబరీష్ ప్రాణం పోయింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా శబరీష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
FireCracker
Explosion
Challenge
Bengalore
Viral Videos

More Telugu News