Pawan Kalyan: సగం భూములు బాంబులు వేసి, భయపెట్టి లాక్కున్నవే: పవన్ కల్యాణ్

Pawan Kalyan slams Jagan over Saraswati Power Company

  • పల్నాడు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్
  • సరస్వతి పవర్ కంపెనీ భూముల పరిశీలన
  • బాంబులు వేసి, భయపెట్టి భూములు రాయించుకున్నారని ఆరోపణ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ సాగించిన దోపిడీకి నిదర్శనం సరస్వతి పవర్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాలు భయపెట్టి తీసుకున్నారని వెల్లడించారు. ఈ విధంగా లాక్కున్న భూముల్లో ఒక్క వేమవరం మండలంలోనే  20 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. 

400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన భూములు 1,384 ఎకరాలు అని వెల్లడించారు. 1,083 ఎకరాలు పట్టాభూములు అని,అందులో సగం భూములు బాంబులు వేసి, భయపెట్టి లాక్కున్నవేనని తెలిపారు. 

మాచవరం, దాచేపల్లి మండలాల్లో భూ సొంతదారుల పిల్లలను చదివిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని వైసీపీ నేతలు నమ్మబలికి భూములు రాయించుకున్నారని వివరించారు. సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు రావని తెలుసుకుని, క్యాప్టివ్ పవర్ కంపెనీ అని చెప్పారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

2009లో 30 సంవత్సరాల లీజుకు తీసుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ లీజును 50 ఏళ్లకు మార్చేశారని తెలిపారు. ప్రజల ఆస్తులు దోచేసి... ఆస్తుల పంపకాల కోసం అన్నాచెల్లెళ్లు గొడవలు పడుతున్నారని, వైసీపీ నేతల దోపిడీలు బయటికి లాగుతామని స్పష్టం చేశారు. 

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం దీనిపై కచ్చితంగా చర్చిస్తుందని, అనుమతులు లేని ఈ పవర్ ప్రాజెక్టును, సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News