Pawan Kalyan: నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్

deputy cm pawan kalyan to meet amit shah today in delhi

  • కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే పవన్ కల్యాణ్ ఢిల్లీకి పయనం
  • సాయంత్రం 6.30 గంటల నుండి 7 గంటల వరకూ అమిత్ షాతో సమావేశం 
  • పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి 

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి వెళుతున్నారు. ఈ రోజు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు విమానంలో బయలుదేరి 5,45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి 6.30 నుండి 7 గంటల వరకూ ఆయనతో సమావేశం అవుతారు.

రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రితో పవన్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మాత్రమే కలిసేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

మరో వైపు మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను మంగళవారం పవన్ కల్యాణ్ పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి సంబంధించి గతంలో జరిగిన భూసేకరణపై విచారణ జరుపుతామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీంతో అమిత్ షా వద్ద పవన్ కల్యాణ్ ఏయే అంశాలపై చర్చిస్తారు? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకుంటారు. ఓ అరగంట పాటు అక్కడ ఉండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఏపీకి తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. 

  • Loading...

More Telugu News