Murder Mistery: హంతకుడిని పట్టించిన ఈగలు.. మధ్యప్రదేశ్ లో ఘటన

Flies Helped MP Police Solve A Blind Murder Mystery
  • హత్యా స్థలం పరిశీలిస్తుండగా యువకుడిపై వాలిన ఈగలు
  • అనుమానంతో పరిశీలించగా ఛాతిపై రక్తపు మరకలు
  • విచారణలో హత్య తానే చేశానని ఒప్పుకున్న యువకుడు
మధ్యప్రదేశ్ లో హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువకుడిని ఈగలు పోలీసులకు పట్టించాయి. హత్యాస్థలంలో గుమిగూడిన జనంలో ఉన్న హంతకుడి గుట్టును బయటపెట్టాయి. ఆ యువకుడిపైనే ఈగలు వాలుతుండడం గమనించిన పోలీసులు అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. జబల్ పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో గత నెల 30న ఓ హత్య జరిగింది. పనికోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఊరు చివరున్న పంట పొలాల్లో మనోజ్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహం పడి ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ గుమిగూడిన జనంలో ఓ యువకుడు ధరమ్ ఠాకూర్ శరీరంపై ఈగలు వాలడం పోలీసులు గమనించారు.

దీంతో పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతీపై రక్తపు మరకలు కనిపించాయి. అనుమానంతో మరింత లోతుగా విచారించగా.. మనోజ్ ను తానే హత్య చేసినట్లు ధరమ్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్‌లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాఫ్తులో బయటపడింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ధరమ్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Murder Mistery
Flies
Madhya Pradesh
Murderer

More Telugu News