US Presidential Polls: అమెరికా చరిత్రలోనే తొలిసారి... సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్

Sarah McBride To Be First Transgender Person In US Congress
  • డెలావర్ నుంచి గెలిచిన సారా మెక్ బ్రైడ్
  • డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీపడ్డ సారా
  • ఫలితాల లెక్కింపులో ఆది నుంచి ఏకపక్షమే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు. సెనేట్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున డెలావర్ నుంచి సెనేట్ కు పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ ఈ ఘనత సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు. మంగళవారం పోలింగ్ ముగిశాక చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచి సారా ఆధిక్యం కనబరిచారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వాలెన్ 3 పై ఆమె సునాయాస విజయాన్ని సాధించారు.

సెనేటర్ గా గెలిచిన తర్వాత సారా మెక్ బ్రైడ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావర్ ఓటర్లు గట్టిగా చాటిచెప్పారు. అమెరికన్లుగా మనకందరికీ కావాల్సిన ప్రజాస్వామ్యం ఇదే’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలిస్తే చైల్డ్ కేర్ కు సంబంధించిన ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటానని, ఉద్యోగస్తులకు పెయిడ్ ఫ్యామిలీ, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తానని, హౌసింగ్, హెల్త్ కేర్ విషయాల్లో మెరుగైన వసతులు కల్పిస్తానని సారా హామీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని, సభలో వారి తరఫున గళం వినిపిస్తానని సారా మెక్ బ్రైడ్ తెలిపారు.
US Presidential Polls
US Congress
Transgender
Sarah McBride
Delaware

More Telugu News