US Presidential Polls: ఆ రోజు దేవుడు నన్ను కాపాడింది ఇందుకే.. విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్ భావోద్వేగం

God Spared My Life For A Reason Says Donald Trump On Landslide Win
  • అమెరికాకు మంచి రోజులు వచ్చాయంటూ ట్రంప్ వ్యాఖ్య
  • ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ లో ప్రసంగించిన కాబోయే అధ్యక్షుడు
  • అందరికీ ధన్యవాదాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన ట్రంప్
‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ తనకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పారు. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని, తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకు చేరువలో ఉన్న ట్రంప్.. తనకు మొత్తం 315 కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని చెప్పారు. స్వింగ్ రాష్ట్రాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు ఇంతటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. 

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు అద్భుతంగా పోరాడారని, అదే పోరాటపటిమతో దేశాన్ని మరోమారు అద్భుతంగా తీర్చిదిద్దుకుందామంటూ తన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటననూ ట్రంప్ ప్రస్తావించారు. ‘అమెరికాకు, అమెరికన్లకు సేవ చేయడానికే దేవుడు నా ప్రాణాలు కాపాడాడని చాలామంది నాతో చెప్పారు. ఆ రోజు జరిగిన హత్యాయత్నం నుంచి తనను ప్రాణాలతో బయటపడేయడం వెనకున్న కారణం ఇదే. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందనే కాపాడాడు. ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే సమయం వచ్చింది. దేశానికి సేవ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు, నేను, మనమంతా కలిసి అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దుకుందాం’ అంటూ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు.
US Presidential Polls
Donald Trump
Victory Speech
Trump Thanks

More Telugu News