JD Vance: అమెరికా ఉపాధ్య‌క్షుడు ఆంధ్ర అల్లుడే!

Usha Chilukuri Wife of Republican Partys Vice Presidential Candidate JD Vance
  • అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ
  • ఉషా చిలుకూరికి విశాఖ వాసులతో బంధుత్వం
  • ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ విజ‌యం దాదాపు ఖ‌రారైంది. దాంతో రెండోసారి అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇక రిప‌బ్లిక‌న్ పార్టీ త‌మ ఉపాధ్య‌క్షుడిగా జేడీ వాన్స్‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా విజయోత్సవ ప్ర‌సంగంలోనూ ట్రంప్‌.. వాన్స్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు కూడా. 

అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు. ఆయ‌న‌ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన వారు. ఉషా చిలుకూరి విశాఖప‌ట్నం వాసులకు బంధువు అవుతారు. గతేడాది వరకూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ప‌నిచేసిన‌ శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. దీంతో ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్య‌క్షుడు కానున్నారు. 

90 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల కిందట కాలంచేశారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తెనే ఉషా చిలుకూరి.

ఉష పేరెంట్స్‌ ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని ఆమె అక్కడే పుట్టి పెరిగిన నేపథ్యంలో అంతగా పరిచయం లేదని శాంతమ్మ తెలిపారు. వాన్స్‌ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్ చేసి అభినందించిన‌ట్టు శాంతమ్మ చెప్పారు.

అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ ఎన్నికైన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ మార్మోగిపోతోంది. 
JD Vance
Republican Partys
Vice Presidential Candidate
US Presidential Polls
US Elections Results
USA

More Telugu News