Telangana: 75 ప్రశ్నలతో... తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కులగణన సర్వే

Telangana government caste survey begins today

  • ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్న ప్రభుత్వ సిబ్బంది
  • ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాల సేకరణ
  • విదేశాలకు వెళ్లిన వారి గురించి కూడా సేకరిస్తున్న అధికారులు

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆయా జిల్లాల్లో ఆయా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

కుటుంబాల వివరాల సేకరణలో భాగంగా... ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? అప్పులు ఎన్ని? ఆదాయం ఎంత వస్తుంది? ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆ కుటుంబం నుంచి విదేశాలకు వెళ్లిన వారు ఉన్నారా? ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఉన్నారా? ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు ఉన్నారా? ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తున్నారు.

సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగం వివరాలను నమోదు చేస్తున్నారు. కుటుంబంలో విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఉంటే... ఉద్యోగం కోసం వెళ్లారా? వ్యాపారం కోసం వెళ్లారా? అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కుటుంబం నుంచి ఏ దేశానికి వెళ్లారో తెలుసుకొని... ఒక్కో దేశానికి ప్రభుత్వం ఇచ్చిన కోడ్‌ను నమోదు చేస్తున్నారు.

మంత్రి శ్రీధర్ బాబు ఇంటింటి సర్వేను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఈ సర్వేతో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇంటింటి సర్వే కోసం ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అందరి సలహా మేరకు ప్రశ్నలు రూపొందించినట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్ మోడల్‌గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే సమయంలో అధికారులు ఎలాంటి పత్రాలు తీసుకోరని తెలిపారు.

కాగా, రాష్ట్రంలో 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది అబ్జర్వర్లతో సమగ్ర కులగణన ప్రారంభమైంది. నవంబర్ 30వ తేదీ లోపు కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 175 ఇళ్ల బాధ్యతను అప్పగించారు. మొత్తం 56 అంశాలపై 75 ప్రశ్నలు రూపొందించారు. 

కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్, విద్య, ఆరోగ్యస్థితి, రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పథకాలు అందుకున్న వివరాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ వివరాలు తీసుకోనున్నారు. సర్వేలో తప్పుడు వివరాలు ఇస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.

  • Loading...

More Telugu News