KTR: ఐఏఎస్ అధికారులకు, ఇంజినీర్లకు కేటీఆర్ తీవ్ర హెచ్చరిక

KTR warns IAS officers and Engineers

  • రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుందని బీజేపీ నేత చెప్పారని గుర్తు చేసిన కేటీఆర్
  • రేవంత్ ఆడించినట్లుగా ఆడవద్దని కేటీఆర్ హెచ్చరిక
  • మంత్రి పొంగులేటి... అదానీ కాళ్లు పట్టుకున్నారన్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయని ఐఏఎస్ అధికారులను, ఇంజినీర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటీవలే చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు దీనిని గుర్తించాలన్నారు.

తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం చెప్పినట్లు తోక ఆడిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి... ఆయనే రారాజు... ఆయన శాశ్వతంగా ఉంటాడు... మమ్మల్ని కాపాడుతాడని ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు భావిస్తే కనుక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

రూ.1,100 కోట్లతో పూర్తయ్యే గోదావరి జలాల మళ్లింపును రూ.5,500 కోట్లకు ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ స్కాంపై తప్పకుండా విచారణ జరుపుతామని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్టిమేషన్ ఏ సంస్థ కార్యాలయంలో జరుగుతుందో తమకు తెలుసని... ఆ సంస్థ పేరు ఇప్పుడు చెబితే బాగుండదు కాబట్టి ఊరుకుంటున్నానని తెలిపారు. 

పొంగులేటి... అదానీ కాళ్లు పట్టుకున్నారు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐటీసీ కోహినూర్‌లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటలు సమావేశం జరిగిందన్నారు. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే రేవంత్ రెడ్డి డబుల్ ఇంజిన్‌లో ఒక ఇంజిన్ అదానీ.. మ‌రో ఇంజిన్ ప్రధాని అని మాట్లాడారని, కానీ ఇప్పుడు వారికి అనుకూలంగా ఉన్నాడని ఆరోపించారు.

ప్రధాని కోసం దామగుండంను... అదానీ కోసం రామన్నపేటను అప్పజెప్పాడని విమర్శించారు. మధ్యలో మూసీని మేఘా కృష్ణా రెడ్డికి ఇస్తాడని... ఇది రాసిపెట్టుకోవాలన్నారు. ఈడీలు, ఐటీలు కేవ‌లం వీరిని కాపాడ‌డానికి మాత్ర‌మే ఉన్నాయా? అని ప్రశ్నించారు. పొంగులేటి హోంమంత్రిలా... ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ గొట్టంగాళ్ళకు భయపడేవారు లేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News