Alleti Maheshwar Reddy: కుటుంబ సర్వే పేరుతో కేసీఆర్ మోసం చేస్తే, కులగణన పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా? అని నిలదీత
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని మండిపాటు
సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆనాడు కేసీఆర్ మోసం చేస్తే... ఇప్పుడు కులగణన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కులగణన చేస్తోందని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... బీసీ డిక్లరేషన్ నెరవేర్చకుండా కులగణన అంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ చేసిన కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోవడం వెనుక లోగుట్టు ఏమిటో చెప్పాలని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్... ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. కోర్టుల పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎంతమంది బీసీలు ఉన్నారని నిలదీశారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కులగణన చేపడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి కులగణనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎక్కడకు రమ్మన్నా తాము సిద్ధమే అన్నారు.