Heart Attack: బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్.. వీడియో ఇదిగో!
- బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో ఘటన
- బీఎంటీసీ డిపో 40లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల కిరణ్
- బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
- ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌పై ప్రశంసలు
బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోతే కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) డిపో 40లో కిరణ్ (39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బస్సు నేలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై డ్రైవింగ్ సీట్లోనే కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.