Nara Lokesh: విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నారా లోకేశ్ కీలక ప్రకటన

nara lokesh responds to students posts

  • పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేస్తామన్న మంత్రి 
  • గత ప్రభుత్వం పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని హామీ
  • విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటాయన్న లోకేశ్ 

రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇటు విద్యార్ధులతో పాటు కళాశాల యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అనేక మంది విద్యార్ధులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్‌లు, ఇతర డాక్యుమెంట్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని తెలిపారు. 

గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం నేరుగా కళాశాల ఖాతాలకు జమ చేస్తుండేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తిపలికి కళాశాల ఫీజుల నగదును విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. దీంతో తల్లుల ఖాతాలో జమ అయిన నిధులను విద్యార్ధులే కళాశాలలకు చెల్లించే వారు. 

అయితే ఈ విధానం వల్ల ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తల్లుల ఖాతాలో జమ చేసినా కొందరు సకాలంలో కళాశాలలకు చెల్లించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.  

  • Loading...

More Telugu News