California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. భయాందోళనలలో ప్రజలు.. వీడియో ఇదిగో!
- పెనుగాలులతో వేగంగా విస్తరిస్తున్న మంటలు
- వేలాది మందిని తరలిస్తున్న అధికారులు
- హెలికాప్టర్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ఏంజెలిస్ సమీపంలో కార్చిచ్చు రేగింది. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. పెనుగాలుల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. తొలుత కిలోమీటరు విస్తీర్ణంలో మొదలైన కార్చిచ్చు.. భారీ గాలుల కారణంగా గంటల వ్యవధిలోనే ఏకంగా 62 కిలోమీటర్లకు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంటలు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలలోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లాస్ఏంజెలిస్ చుట్టుపక్కల మూడువేలకు పైగా నివాస ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మంటలు, పెనుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలామంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఓవైపు కార్చిచ్చు, మరోవైపు విద్యుత్ లేక జనం ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పలువురు స్వచ్చందంగా ఇల్లు, వాకిలి విడిచి దూరంగా వెళ్లిపోతున్నారు. మరోవైపు, మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెలికాప్టర్లతో నీటిని కుమ్మరిస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.