Petticoat Cancer: లంగా నాడాతో మహిళలకు ‘పెట్టీకోట్ క్యాన్సర్’

Doctors warn against wearing tight waist cords in saree

  • ఇలాంటి క్యాన్సర్ బారినపడిన ఇద్దరు మహిళలకు చికిత్స చేశామన్న భారతీయ వైద్యుల బృందం
  • లంగా నాడాను బిగించి కట్టడం వల్ల చర్మం ఒరుసుకుపోయి వ్రణం
  • మానని గాయం క్యాన్సర్‌కు సంకేతమన్న వైద్యులు
  • వదులుగా ఉండే లో దుస్తులు ధరించాలని సూచన

మహిళ లంగా నాడా కారణంగానూ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ అధ్యయన వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. లంగాను గట్టిగా బిగించి కట్టుకోవడం వల్ల క్యాన్సర్ బారినపడిన ఇద్దరు మహిళలకు తాము చికిత్స చేసినట్టు భారతీయ వైద్యుల బృందం ఒకటి తెలిపింది

లంగాను గట్టిగా బిగించి కట్టడం వల్ల అది చర్మానికి ఒరుసుకుపోయి పుండ్లు ఏర్పడి చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గతంలో దీనిని ‘చీర క్యాన్సర్’గా వ్యవహరించే వారని, కానీ, లంగా నాడా బిగించి కట్టడం వల్ల ఈ క్యాన్సర్ వస్తోంది కాబట్టి ఇప్పుడు దీనిని ‘పెట్టీకోట్ క్యాన్సర్’గా పిలవాలని పేర్కొన్నారు.

తమ వద్దకు వచ్చిన రెండు కేసుల్లో ఒక మహిళ వయసు 70 సంవత్సరాలని, మరో మహిళ వయసు 60 ఏళ్లని వైద్యులు తెలిపారు. 70 ఏళ్ల మహిళకు 18 నెలల నుంచి నడుము కుడిపక్క అయిన గాయం మానడం లేదని, 60 ఏళ్ల మహిళ కూడా రెండేళ్లుగా ఇదే రకమైన గాయంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ కురుపులను మార్జొలిన్ వ్రణంగా వర్గీకరించారు. వదులుగా ఉండే లో దుస్తులు ధరించడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య బృందం తెలిపింది.

  • Loading...

More Telugu News