Nara Lokesh: విట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో సందడి చేసిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- ఐనవోలులో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్
- స్టాల్స్ ఏర్పాటు చేసిన విదేశీ విద్యా సంస్థలు
- ఆసక్తిగా తిలకించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్
ఏపీ రాజధాని అమరావతి ఐనవోలులోని ప్రఖ్యాత విద్యాసంస్థ వీఐటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆద్యంతం సందడి చేశారు.
మంత్రి నారా లోకేశ్ కు యూనివర్సిటీ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు రెడ్ కార్పెట్ వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, మంత్రి లోకేశ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనను పురస్కరించుకుని యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటారు.
విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి
అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనలో వివిధ దేశాల ప్రతినిధులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను మంత్రి నారా లోకేశ్ ఆసక్తిగా తిలకించారు. తమ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు గల అవకాశాలు, కోర్సుల వివరాలు, అడ్మిషన్లు, ఉపకారవేతనాలు, సౌకర్యాలు వివరిస్తూ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడాకు సంబంధించిన విద్యాసంస్థల ప్రతినిధులు ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
స్టాల్స్ మొత్తం కలియతిరిగిన మంత్రి నారా లోకేశ్ ఆయా దేశాల ప్రతినిధులతో సంభాషించారు. ఆయా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విట్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన వివిధ ఆవిష్కరణలను లోకేశ్ వీక్షించారు. వ్యవసాయ పనులకు తక్కువ ఖర్చులో లభ్యమయ్యే, వరదలను గుర్తించగల అత్యాధునిక డ్రోన్ ను ప్రదర్శించగా మంత్రి ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దీంతో పాటు విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత వాహనం, రోబోటిక్ హ్యాండ్ రోవర్, స్మార్ట్ డాగ్ కోలార్, నెక్ట్స్ జనరేషన్ పీహెచ్ సెన్సార్స్ కలిగిన శక్తి 2.0, మూడు సెకన్లలో 180 కి.మీ స్పీడ్ అందుకోగల హైస్పీడ్ డ్రోన్, హ్యూమనాయిడ్ రోబోట్ ను మంత్రి పరిశీలించారు. ఆయా ఆవిష్కరణల గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సృజనతో అద్భుత ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థులను అభినందించారు. వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు.