Vangalapudi Anitha: తల్లిని, చెల్లిని తిడుతుంటే జగన్ పౌరుషం ఏమైంది?: హోంమంత్రి అనిత

Home minister Anitha slams Jagan over social media posts row

  • సోషల్ మీడియా పోస్టులపై అనిత స్పందన
  • వైసీపీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపణ
  • జగన్ రక్తం మరగలేదేమో కానీ... మా రక్తం మరుగుతోంది అంటూ ఫైర్
  • కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందని వెల్లడి

సోషల్ మీడియా పోస్టుల అంశంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. తల్లి, చెల్లి గురించి వైసీపీ కార్యకర్తలే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత తల్లిని, చెల్లిని తిడుతుంటే జగన్ కు పౌరుషం రాలేదా? అని ప్రశ్నించారు. 

తల్లి, చెల్లి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడారో మీకు తెలియదా? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో కానీ... మా రక్తం మాత్రం మరుగుతోంది అని జగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 

"సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టు వాగే కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. మీరు సప్తసముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం" అంటూ అనిత వార్నింగ్ ఇచ్చారు. ఏపీ పరువును జగన్ ఎప్పుడో తీసేశారని, రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారని అనిత మండిపడ్డారు. 

వైసీపీ పాలనలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్క చూడాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని నేరాలు, ఘోరాలు జరిగినా జగన్ ఐదేళ్ల పాటు మాట్లాడలేదు... అత్యాచారాలు, హత్యలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. ఇప్పుడొచ్చి, ఈ ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నాడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమందిపై కేసులు పెట్టారు. చింతకాయల విజయ్, రంగనాయకమ్మ, గౌతు శిరీషలను ఇబ్బందిపెట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అంటే ఏమిటో జగన్ కు తెలుసా? అమరావతి మహిళా రైతుల గురించి నీచాతినీచంగా మాట్లాడారు. జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు. 

వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి దారుణమైన పోస్టులు పెట్టాడు. విజయమ్మ, షర్మిలపై ఘోరమైన పోస్టులు పెట్టడం మనం చూశాం. వైసీపీ కార్యకర్తలు పెట్టే కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది" అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News