Mohammad Nabi: మహ్మద్ నబీ సంచలన నిర్ణయం.. వన్డేలకు వీడ్కోలు!

Afghanistan All Rounder Mohammad Nabi set to Retire after ICC Champions Trophy 2025
  • 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్ బై
  • కొన్ని నెలల ముందే తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపిన నబీ 
  • తాజాగా ధ్రువీక‌రించిన బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ నసీబ్ ఖాన్
ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ ఆట‌గాడు మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. పాకిస్థాన్ వేదిక‌గా జ‌రిగే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్ప‌నున్నాడు. ఈ మేర‌కు తన నిర్ణయాన్ని నబీ ఇప్పటికే ఆఫ్ఘ‌నిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియ‌జేశాడ‌ని తాజాగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ నసీబ్ ఖాన్ చెప్పారు.

"వ‌చ్చే ఏడాది జ‌రిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మహ్మద్ నబీ వన్డేల‌కు వీడ్కోలు పలకాలని నిర్ణ‌యించుకున్నాడు. కొన్ని నెలల ముందే నబీ తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపాడు. అత‌ని నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుంది. నబీ వన్డేల నుంచి త‌ప్పుకున్నా, పొట్టి ఫార్మాట్‌లో కొన‌సాగుతాడ‌ని ఆశిస్తున్నా" అని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు.

కాగా, 39 ఏళ్ల మహ్మద్ నబీ 2009లో వన్డేల‌తోనే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ప్రారంభించాడు. అలా త‌న‌ 15ఏళ్ల కెరీర్‌లో ఈ ఆల్‌రౌండ‌ర్‌ దేశం త‌ర‌ఫున 165 వన్డేలు ఆడాడు. అందులో 3,537 పరుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు ఉన్నాయి. అలాగే 171 వికెట్లు తీశాడు. 

ఇక ఈ ఆఫ్ఘ‌నిస్థాన్ ఆల్‌రౌండ‌ర్ ఐపీఎల్‌లోనూ వివిధ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2017లో నబీ తొలిసారి ఐపీఎల్ ఆడాడు. స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) తరఫున నబీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కోల్‌క‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), ముంబయి ఇండియన్స్ (ఎంఐ) జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
Mohammad Nabi
Afghanistan
Retirement
Cricket
Sports News
ICC Champions Trophy 2025

More Telugu News