Chandrababu: స్కూటర్ ఎంత ముఖ్యమో ఆమె పరిస్థితి చూస్తే అర్థమవుతోంది: సీఎం చంద్రబాబు

Chandrababu shares AP Police video

  • చోరీకి గురైన బైకులను రికవరీ చేసిన ఏలూరు పోలీసులు
  • ఓ మహిళకు స్కూటర్ అప్పగింత
  • తన స్కూటర్ ను చూసుకుని కన్నీటిపర్యంతమైన మహిళ
  • తన హృదయం చలించిపోయిందన్న సీఎం చంద్రబాబు

ఏలూరు పోలీసులు చోరీకి గురైన బైకులను రికవరీ చేసి, వాటిని సొంతదారులకు అప్పగించారు. గడచిన 3 నెలల కాలంలో దాదాపు 250కి పైగా బైకులను యజమానుల చెంతకు చేర్చారు. 

ఓ మహిళకు చెందిన స్కూటర్ ను కూడా పోలీసులు రికవరీ చేసి, ఆమెకు అప్పగించారు. ఆ మహిళ తన స్కూటర్ ను చూసి కన్నీటిపర్యంతమైంది. తీవ్ర భావోద్వేగాలతో తన స్కూటర్ ను తడిమిచూసుకుంది. 

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డను ప్రతి రోజూ ఆ స్కూటర్ పైనే ఆసుపత్రికి తీసుకెళ్లేది. ఆ విధంగా ఆ స్కూటర్ ఆమె కుటుంబానికి ఎంతో అవసరం అని ఏపీ పోలీసులు వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆ తల్లికి ఆ స్కూటర్ ఎంత అవసరమో తెలిశాక తన హృదయం చలించిపోయిందని పేర్కొన్నారు. 

"తలసేమియా జబ్బుతో బాధపడే తన కుమార్తెను ప్రతి రోజూ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ఆ స్కూటర్ చోరీకి గురికావడంతో నీలి అలివేణి అనే ఆ మహిళ తీవ్ర వేదనకు గురైంది. పోలీసులు రికవరీ చేసిన తన స్కూటర్ ను చూశాక మహిళ ప్రదర్శించిన భావోద్వేగాలను చూస్తే, ఆ స్కూటర్ ఆమెకు ఎంత ముఖ్యమైనదో అర్థమవుతోంది.

ఇలాంటి అవసరాల కోసం, ఉపాధి కోసం ఉపయోగపడే బైకులు, స్కూటర్లు చోరీకి గురైనప్పుడు ఆయా కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అయితే, గత మూడు నెలల్లో పోలీసులు 251 ద్విచక్రవాహనాలను రివకరీ చేసి, 25 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి, ఇలాంటి కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారు. తద్వారా బాధిత కుటుంబాలకు ఊరట కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఏలూరు పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News