North Korea: కిమ్ జీపీఎస్ దాడితో సౌత్ కొరియా విలవిల
- విమానాలు, నౌకల రాకపోకలపై ప్రభావం
- పొరపాటున నార్త్ కొరియాలోకి ప్రవేశించే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటూ పైలట్లకు హెచ్చరిక
సౌత్, నార్త్ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బెలూన్లలో చెత్త నింపి తమ దేశంలోకి పంపిస్తోందంటూ నార్త్ కొరియా ప్రభుత్వం దాయాది దేశంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ చెత్త పనులు ఆపకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందంటూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తో పాటు ఆయన సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. తాజాగా సౌత్ కొరియాపై ప్రతీకారానికి పూనుకున్నారు. శుక్రవారం సౌత్ కొరియా జీపీఎస్ వ్యవస్థపై దాడులు మొదలుపెట్టారు.
ఉపగ్రహం ద్వారా అందే జీపీఎస్ సేవలను స్పూఫ్ చేయడంతో సౌత్ కొరియాలో విమానాలు, భారీ నౌకల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వరుసగా రెండో రోజు శనివారం కూడా నార్త్ కొరియా ఈ దాడులు కొనసాగిస్తోందని సౌత్ కొరియా మిలటరీ ఆరోపించింది. కిమ్ దుశ్చర్యలతో తమ దేశంలో ప్రయాణికుల విమానాలతో పాటు నౌకల రాకపోకల్లో గందరగోళం నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. జీపీఎస్ వ్యవస్థలో లోపాలు, తప్పుడు మార్గం చూపించే ముప్పు ఉందని తమ పైలట్లను సౌత్ కొరియా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీపీఎస్ పై పూర్తిగా ఆధారపడ వద్దని సూచించింది.
తమ గగనతలంలోకి వచ్చిన ఏ విమానాన్ని అయినా అమెరికా నిఘా విమానంగానే భావించి కూల్చేస్తామని ఇటీవల కిమ్ హెచ్చరించారు. ఈ క్రమంలో పొరపాటున తమ విమానాలు నార్త్ కొరియాలోకి ఎంటరైతే వాటిపై దాడి జరిగే ప్రమాదం ఉందని సౌత్ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా చేపట్టిన జీపీఎస్ స్పూఫింగ్ కు విరుగుడు చేపట్టేందుకు సౌత్ కొరియా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.