Kandula Durgesh: నేడు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది: మంత్రి కందుల దుర్గేశ్
- విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ సర్వీస్
- విజయవాడలో డెమో లాంచ్ చేసిన చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు
- ఇదొక వినూత్న కార్యక్రమం అంటూ టూరిజం మంత్రి దుర్గేశ్ వ్యాఖ్యలు
ఏపీ టూరిజం చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం నమోదైంది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ సర్వీస్ ను ప్రారంభించారు. ఈ డెమో కార్యక్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ ఇక అద్భుతాన్ని ఆవిష్కరించిన సందర్భం అని అభివర్ణించారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే, నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతూ... సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకెళుతున్న సీఎం చంద్రబాబు కీర్తికిరీటంలో ఈ సీప్లేన్ ఒక కలికితురాయి అని పేర్కొన్నారు.
"మనం జలయానం చేశాం, ఆకాశ యానం చేశాం... ఇవాళ మనం జలంతో పాటు, ఆకాశంలోనూ ప్రయాణించే వినూత్న కార్యక్రమం ప్రారంభించుకున్నాం. జలమార్గం ద్వారా ఆకాశమార్గంలోకి ప్రయాణించడం అనే ఈ సీ ప్లేన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం కేంద్ర విమానయాన శాఖకు, ఏపీ టూరిజం శాఖకు గర్వకారణం.
ఏపీకి 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా వంటి జీవనదులు మనకున్నాయి. దాంతో పాటు అటవీప్రాంతం, ప్రకృతి రమణీయత ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ గడచిన ఐదేళ్లలో ఏపీ పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసిన ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూశాం.
ఇవాళ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో, ఆయనకు సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో... ఏపీ టూరిజంను మళ్లీ పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా సహకారం అందిస్తున్నారు. ఈ సీ ప్లేన్ కార్యక్రమాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం" అని వివరించారు.