Jan Zelezny: జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు కోచ్ గా సరైనోడు!

Javelin legend Jan Zelezny set to coach Neeraj Chopra

  • 2020లో టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా
  • ఆ తర్వాత తరచుగా గాయాలు
  • ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో రజతంతో సరిపెట్టుకున్న చోప్రా
  • నీరజ్ చోప్రాకు కొత్త కోచ్ గా జావెలిన్ దిగ్గజం జాన్ జెలెజ్నీ

అథ్లెటిక్స్ అంశంలో భారత్ కు ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం అందించిన అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్ క్రీడాంశంలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో పసిడి గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే, టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా నుంచి ఆ స్థాయి ప్రదర్శన రాలేదు. 

ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ భారత జావెలిన్ స్టార్ ను తరచుగా గాయాలు బాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

నీరజ్ చోప్రా కోచ్ గా అంతర్జాతీయ జావెలిన్ దిగ్గజం జాన్ జెలెజ్నీ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా స్వయంగా ప్రకటించాడు. జావెలిన్ త్రో క్రీడాంశంలో 90 మీటర్ల వరకు విసరడం అంటే అదొక గొప్ప ఘనతగా భావిస్తారు. ఇటీవల పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఫైనల్లో అర్షద్ నదీమ్ విసిరిన త్రో అద్భుతమని కథనాలు వచ్చాయి. 

కానీ, జాన్ జెలెజ్నీ దాదాపు మూడు దశాబ్దాల కిందటే దాదాపు 100 మీటర్లకు చేరువలో జావెలిన్ విసిరాడంటే అతిశయోక్తి కాదు. జాన్ జెలెజ్నీ... చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జావెలిన్ త్రోయర్. మూడు సార్లు ఒలింపిక్ గోల్డ్ గెలిచాడు. 1992, 1996, 2000 సంవత్సరాల్లో నిర్వహించిన ఒలింపిక్స్ లో జాన్ జెలెజ్నీకి ఎదురులేకుండా పోయింది. 

1996లో 98.48 మీటర్లతో జెలెజ్నీ చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయడం కాదు కదా, దారిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకోగా... రజతం గెలిచిన జాకబ్ వాద్లెచ్, కాంస్యం గెలిచిన విటెస్లావ్ వెసెలీలకు కోచ్ గా వ్యవహరించింది జెలెజ్నీనే. అంతేకాదు, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ మహిళా జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవాకు కూడా జెలెజ్నీ కోచ్ గా వ్యవహరించాడు. 

కాగా, తన కొత్త కోచ్ గా జావెలిన్ దిగ్గజం జాన్ జెలెజ్నీ వస్తుండం పట్ల, నీరజ్ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. జెలెజ్నీ ప్రదర్శనలు చూస్తూ పెరిగానని, ఆయన టెక్నిక్ ను ఎంతగానో ఇష్టపడతానని చోప్రా తెలిపాడు. జావెలిన్ లో జెలెజ్నీని కొట్టే మొనగాడు లేడని, ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా తన త్రోయింగ్ టెక్నిక్ మెరుగుపడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. జావెలిన్ ను విసిరే విధానం చూస్తే, తామిద్దరి శైలి ఒక్కలాగానే ఉంటుందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. 

ఇక జాన్ జెలెజ్నీ కూడా ఈ అంశంపై స్పందించాడు. నీరజ్ లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని తాను గతంలో చెప్పానని గుర్తుచేశారు. అతడి కెరీర్ మొదట్లో చూసినప్పుడు, ఉన్నతస్థాయిలో ఫలితాలు సాధించగల సత్తా ఉన్నవాడనిపించిందని తెలిపాడు. అంతేకాకుండా, చెక్ దేశం వెలుపల తాను ఎవరికైనా కోచ్ గా పనిచేయాల్సి వస్తే నా మొదటి ప్రాధాన్యత నీరజ్ చోప్రాయేని అప్పట్లోనే చెప్పానని వివరించాడు.

  • Loading...

More Telugu News