Tamil actor: ప్రముఖ సినీ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత

Veteran Tamil Actor Delhi Ganesh dies at 80

  • కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటుడు
  • శనివారం రాత్రి తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
  • తమిళం, తెలుగు భాషలలో 400 లకు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేశ్

ప్రముఖ సినీ నటుడు ఢిల్లీ గణేశ్ శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి తుదిశ్వాస వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ నటుడు అయిన ఢిల్లీ గణేశ్ తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళ్ సహా వివిధ భాషలలో 400 లకు పైగా సినిమాల్లో నటించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీస్ లలోనూ ఆయన నటించారు. చివరిసారిగా కమల్ హాసన్ సినిమా ‘భారతీయుడు -2’ లో నటించారు. ఢిల్లీ గణేశ్‌ మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం (నేడు) చెన్నైలో ఢిల్లీ గణేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఢిల్లీ గణేశ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాదాపు పదేళ్లు భారత వైమానిక దళంలో ఆయన సేవలందించారు. తొలుత కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘పట్టిన ప్రవేశం’ లో నటించారు. 1977లో విడుదలైన ఈ సినిమా ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ‘జైత్రయాత్ర’, ‘నాయుడమ్మ’, ‘పున్నమినాగు’ తదితర సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1994 లో తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీ గణేశ్ ను కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఢిల్లీకి చెందిన 'దక్షిణ భారత నాటక సభ' అనే రంగస్థల బృందంలో సభ్యుడిగా చేరడం వల్ల అప్పటి నుంచీ ఆయనను ఢిల్లీ గణేశ్ అంటూ పిలుస్తున్నారు. 

  • Loading...

More Telugu News