Team Australia: ఆస్ట్రేలియా బ్యాటర్ల పేరిట చెత్త రికార్డు.. చరిత్రలో ఇదే తొలిసారి

For the first time no Aussie batter managed to score a fifty in a mens ODI series in their history
  • స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెత్త ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు
  • సిరీస్‌లో ఒక్కరు కూడా అర్ధ శతకం సాధించని వైనం
  • ఒక వన్డే సిరీస్‌‌లో ఆసీస్ బ్యాటర్లు ఇంత దారుణంగా విఫలమవ్వడం ఇదే తొలిసారి
ఆస్ట్రేలియా జట్టుకు స్వదేశంలో అనూహ్య పరాజయం ఎదురైంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించిన తర్వాత దక్కిన ఈ ఘనవిజయంతో పాక్ ఆటగాళ్లు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆసీస్ ఆటగాళ్ల పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. 

మొదటిసారిగా ఒక వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. 

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేలు జరగగా... మెల్‌బోర్న్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ సాధించిన 49 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఇంగ్లిస్‌కు సమీపంలో స్టీవెన్ స్మిత్ 44 పరుగులతో ఉన్నాడు. ఇక రెండవ వన్డేలో స్మిత్ సాధించిన 35 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉన్నాయి. 

సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డేల్లో ఆస్ట్రేలియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. 8వ స్థానంలో వచ్చి 30 పరుగులు సాధించిన షాన్ అబాట్ ఆసీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రీది 3, నసీమ్ షా 3, రవూఫ్ 2 వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. సునాయస లక్ష్యాన్ని 26.5 ఓవర్లలో ఛేదించి పాకిస్థాన్ సిరీస్ విజయాన్ని సాధించింది. దీంతో ఆస్ట్రేలియా గత ఐదేళ్లలో తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

కాగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఆసీస్ సిరీస్ కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంది.
Team Australia
Cricket
Sports News
Pakistan Vs Australia

More Telugu News