India Vs South Africa: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే విజయం
- ఆపసోపాలు పడుతూ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
- వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ప్రదర్శన వృథా
- చివరి వరకు క్రీజులో ఉండి సఫారీ జట్టుని గెలిపించిన ట్రిస్టన్ స్టబ్స్
గెబెర్హా వేదికగా జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. స్వల్ప స్కోరింగ్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించడానికి ఆతిథ్య జట్టు ఆపసోపాలు పడింది. ట్రిస్టన్ స్టబ్స్ 47 పరుగులతో రాణించడంతో 19 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు భారత బౌలర్లు అద్భుతంగా ప్రయత్నించారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో సిరీస్ 1-1తో సమం అయింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. 41 బంతుల్లో 47 పరుగులతో కడవరకు క్రీజులో ఉన్నాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ 3, ర్యాన్ రికెల్టన్ 13, రీజా హెండ్రిక్స్ 24, హెన్రిచ్ క్లాసెన్ 2, డేవిడ్ మిల్లర్ 0, మార్కో యన్సెన్ 7, ఆండిల్ సిమలన్ 7, గెరాల్డ్ కోయెట్జీ 19 (నాటౌట్) స్వల్ప స్కోర్లు చేశారు.
బ్యాటింగ్‌లో విఫలమైన భారత ఆటగాళ్లు...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. టాపార్డర్ విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగారు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4, తిలక్ వర్మ 20, అక్షర్ పటేల్ 27, హార్దిక్ పాండ్యా 39 (నాటౌట్), రింకూ సింగ్ 9 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యన్సెన్, గెరాల్డ్ కోట్జీ, ఆండిలె సిమిలేన్, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, ఎన్ కబయోంజి పీటర్ తలో వికెట్ తీశారు.