Suryakumar Yadav: పాక్ అభిమాని ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే.. వీడియో ఇదిగో!

Suryakumar Yadavs Reply Goes Viral After Fan Asks Pakistan Kyu Nhi Aa Rhe
  • ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
  • జట్టును పంపేది లేదన్న భారత్
  • మీరు ఎందుకు రానంటున్నారని అడిగిన పాక్ అభిమాని
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత జట్టు నిరాకరించింది. దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహిస్తే తమ జట్టు పాల్గొంటుందని ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చింది. అయితే, తమ దేశంలోనే మ్యాచ్ లు నిర్వహిస్తామని పాక్ బోర్డ్ స్పష్టం చేసింది. భారత్, పాక్ రెండూ ఈ విషయంలో పట్టుదలగా ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. భారత జట్టు ఆడకుంటే ట్రోఫీ నిర్వహణలో అర్థమే లేదని పీసీబీ అభిప్రాయపడింది.

ఇదిలావుంచితే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. అక్కడ జరుగుతున్న టీ20 మ్యాచ్ కు హాజరైన పాకిస్థాన్ క్రికెట్ అభిమాని ఒకరు సూర్యకుమార్ యాదవ్ తో ఫొటో దిగాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మీరు పాకిస్థాన్ కు ఎందుకు రావడంలేదో చెబుతారా? అంటూ సూర్యకుమార్ యాదవ్ ను అడిగాడు. దీనికి సూర్యకుమార్ జవాబిస్తూ.. 'అరె భాయీ.. మా చేతుల్లో ఏముంది?' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే విషయంలో ఐసీసీ పునరాలోచనలో పడిందని, ఈ ఏడాది ట్రోఫీని రద్దు చేసే యోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. భారత జట్టు ఆడే మ్యాచ్ ల విషయంలో పాక్ బోర్డు పట్టువిడవకుంటే ట్రోఫీ రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Suryakumar Yadav
Team India
Cricket
Champions Trophy 2025
Pakistan
PCB
ICC

More Telugu News