Maharashtra Polls: బీజేపీని కుక్కతో పోల్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

Maharashtra Congress chief Nana Patole compares BJP to dog

  • బీజేపీని కుక్కలా మార్చే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే
  • ఓబీసీలంటే బీజేపీకి ఎంతమాత్రమూ గౌరవం లేదన్న కాంగ్రెస్ చీఫ్
  • ఓబీసీలను కుక్కలు అంటున్న బీజేపీకి దాని స్థానమేంటో చెప్పే సమయం వచ్చిందన్న పటోలే
  • పటోలే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత కిరిట్ సోమయ

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మరో వివాదానికి తెరలేపుతూ బీజేపీని కుక్కతో పోల్చారు. అకోలాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన.. ‘‘మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా?’’ అని ప్రశ్నించారు. బీజేపీని ఇప్పుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. 

మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే.. పలు అబద్ధాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ నేతలు తమనుతాము దేవుడిగా, విశ్వగురుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫడ్నవీస్ కూడా తనకు తాను దేవుడినని అనుకుంటున్నారని విమర్శించారు. 

నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ తీవ్రంగా స్పందించారు. ఓటమితో నిరాశ, నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు బీజేపీ వారిని కుక్కలుగా పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. అధికార మహాయుటి, ప్రతిపక్ష మహావికాశ్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News