Heart Attack: కేపీహెచ్‌బీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.. వీడియో ఇదిగో!

Man dies of heart attack at Anjaneyaswami temple in Hyderabad
  • ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆలయ స్తంభాన్ని పట్టుకున్న విష్ణువర్ధన్
  • ఆ వెంటనే కుప్పకూలి మృతి
  • సీపీఆర్ చేసినా ఫలితం శూన్యం
  • ప్రగతినగర్‌లో షాపింగ్ చేస్తూ గుండెపోటుతో మరో వ్యక్తి మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. యువకుడిని 31 ఏళ్ల విష్ణువర్ధన్‌గా గుర్తించారు. తమ కళ్లముందే ప్రదక్షిణలు చేసిన యువకుడు అంతలోనే మృతి చెందడంతో భక్తులు విషాదంలో మునిగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన విష్ణువర్ధన్ హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తరచూ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి వెళ్తుండేవాడు. 

నిన్న ఉదయం 8.30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన యువకుడు ప్రదక్షిణలు చేస్తుండగా గుండెలో నొప్పి రావడంతో ఆలయంలోని స్తంభాన్ని పట్టుకున్నాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. అది చూసిన భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే విష్ణువర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆలయంలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి సహజ మరణంగా తేల్చారు. 

ఇలాంటి ఘటనే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో జరిగింది. జాకీ షోరూంలో షాపింగ్ చేస్తూ 37 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మృతుడిని కలాల్ ప్రవీణ్‌గౌడ్‌గా గుర్తించారు. షోరూంలో కుప్పకూలిన ప్రవీణ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. 
Heart Attack
KPHB
Anjaneyaswami Temple
Kadiri
Viral New

More Telugu News