Crime News: భార్యాపిల్లలను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన నగల వ్యాపారి

Jeweller Kills Wife And Children And Photos Uploaded In WhatsApp Status
  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • భార్యను కత్తితో పొడిచి చంపి, పిల్లలకు విషమిచ్చిన వైనం
  • అనంతరం రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నం
  • రక్షించిన ఆర్పీఎఫ్ పోలీసులు
భార్య, పిల్లలను హత్య చేసిన ఓ నగల వ్యాపారి ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం... నగల వ్యాపారి ముకేశ్ వర్మకు భార్య రేఖ, కుమార్తెలు భవ్య (22), కావ్య (17), కుమారుడు అభిష్త్ (12) ఉన్నారు. ముకేశ్ వర్మ నాలుగంతస్తుల భవనంలో సోదరులతో కలిసి జీవిస్తున్నాడు. 

ఈ క్రమంలో నిన్న భార్యను కత్తితో పొడిచి చంపిన ముకేశ్ వర్మ... కుమార్తెలు, కుమారుడికి విషం ఇచ్చి చంపేశాడు. అనంతరం ఆ ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టాడు. ఆ తర్వాత రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి ఆయనను కాపాడారు. 

ముకేశ్ వాట్సాప్ స్టేటస్ చూసిన ఇతర కుటుంబ సభ్యులు వారి గదిలోకి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. కుటుంబ తగాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను హత్య చేసిన అనంతరం రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ముకేశ్ వర్మ మధుర ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రయాణికులు స్పందించి ఆర్పీఎఫ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో వచ్చి వర్మను రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Uttar Pradesh
WhatsApp Status

More Telugu News