Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్... బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నలుగురికి నోటీసులు

Three BRS Former MLAs Gets Notices Regarding Phone Tapping Case
  • ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ
  • తాజాగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ నేతలకు నోటీసులు పంపిన పోలీసులు!
  • ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకున్నట్లు సమాచారం.

ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

అమృత్ టెండర్లలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సర్కార్ పై ఫిర్యాదు చేయనున్నారు.

మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా టూర్ లో ఉన్నానని, ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అయితే, నెలలు గడిచినా ఆయన తిరిగి రాకపోవడంతో ప్రభాకర్ రావును భారత్ కు రప్పించడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే ప్రభాకర్ రావుకు తాజాగా అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చిందని, ఇప్పట్లో ఆయన భారత్ కు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
Phone Tapping Case
BRS Mlas
Chirumurthy
MahabubNagar
Nalgonda

More Telugu News