Amit Kataria: నెలకు రూపాయి వేతనం.. అయినా ఐఏఎస్‌లలో అత్యంత ధనవంతుడీ అధికారి!
- దేశం దృష్టిని ఆకర్షించిన అమిత్ కటారియా
- ఆయన నికర ఆస్తి విలువ రూ. 8.9 కోట్లు
- అంకితభావంతో పనిచేసే అధికారిగా గుర్తింపు
- ఆయన కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
- అమిత్ భార్య అస్మిత కమర్షియల్ పైలట్
ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించారు. సివిల్ సర్వెంట్‌గా నెలకు రూపాయి వేతనం తీసుకునే ఆయన మొత్తం ఐఏఎస్ అధికారుల్లోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు రూ. 8.9 కోట్లు.
ఎవరీ అమిత్ కటారియా?
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన అమిత్ కటారియా 2004 చత్తీస్‌గఢ్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సమర్థవంతంగా, అంకితభావంతో పనిచేసే అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న కటారియా ప్రతిష్ఠాత్మక ఐఐటీలో చదువు పూర్తిచేశారు. 2003లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు. తొలుత జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిన అమిత్ ఇటీవల గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
రూపాయి వేతనం
ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే రూపాయి వేతనం తీసుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నారు. దేశానికి సేవ చేసేందుకే ఐఏఎస్‌ను ఎంచుకున్నానని, డబ్బు కోసం కాదని పేర్కొన్నారు. ఆయన నికర ఆస్తి విలువ రూ. 8.9 కోట్లు. ఆయన కుటుంబానికి ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఇది సమకూరింది. అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారిగా పేరు పొందిన అమిత్ ఏడేళ్లపాటు కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆయన భార్య అస్మిత హండా కమర్షియల్ పైలట్.
ఐఏఎస్ అధికారి వేతనం ఎంతంటే?
ఐఏఎస్ అధికారులకు సాధారణంగా ప్రారంభంలోనే రూ. 50 నుంచి రూ. 60 వేలు ఉంటుంది. సీనియర్ అధికారులకు వారి ర్యాంకులు, సీనియారిటీని బట్టి నెలకు రూ. 2 లక్షల వరకు ఉంటుంది.