DK Aruna: కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్ర కోణం ఉంటే.. ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది?: డీకే అరుణ

DK Aruna questions what intelligence is doing when attack on collector
  • లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని భావించడం లేదన్న డీకే అరుణ
  • శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు
  • ఫార్మా కంపెనీని ప్రజలు వ్యతిరేకిస్తున్నా రేవంత్ రెడ్డికి ఎందుకంత ప్రేమ అని నిలదీత
లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌‍పై దాడి ఘటనలో కుట్ర కోణం ఉండి ఉంటే... ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో కుట్రకోణం ఉందంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని తాము భావించడం లేదన్నారు. ఈ ఘటనలో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని గుర్తించాలన్నారు. ప్రజలు అంతగా వ్యతిరేకిస్తున్న ఫార్మా ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. అక్కడకు కలెక్టర్ వెళ్లినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ మీద దాడి జరిగిన సమయంలో అక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారని తెలిపారు.

అసలు ఈ ప్రాజెక్టు ఎవరిది? ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఇవన్నీ తెలియాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పట్నం నరేందర్ రెడ్డి భార్యకు సబిత పరామర్శ

లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్యను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
DK Aruna
Telangana
District Collector
Vikarabad District

More Telugu News