Nara Lokesh: రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తిచేస్తాం: లోకేశ్

Minister Nara Lokesh Asserts Tribal University Complete In 2 Years

  • విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ ప్రశ్నలు
  • వివరంగా సమాధానమిచ్చిన మంత్రి నారా లోకేశ్
  • 2019లో నిర్ణయించిన స్థలంలోనే సెంట్రల్ వర్సిటీని పూర్తిచేస్తామని హామీ
  • తమకు పేరొస్తుందన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం స్థలం మార్చిందని విమర్శ
  • అభివృద్ది వికేంద్రీకరణ అంటే రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదని పరోక్షంగా జగన్‌పై విమర్శ

వచ్చే రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. రాజకీయంగా తమకు మంచి పేరు వస్తుందన్న దుగ్ధతో గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి అయిదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని విమర్శించారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.  

విభజనచట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో లోకేశ్ సమాధానమిచ్చారు. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారని, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరులో విండ్ టర్బయిన్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, సెల్‌ఫోన్, ఉభయగోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటీ, మెడికల్ డివైజ్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారని పేర్కొన్నారు.

విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటుచేశారని, ఐఐటీ తిరుపతికి, ఐఐఎం విశాఖకి, ఎన్ఐటీ తాడేపల్లిగూడేనికి, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదేనని,  500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.

ఐఐటీ తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించామని, ఎన్ఐటీ తాడేపల్లిగూడేనికి ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాలు భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్‌కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటీలకు కూడా అప్పట్లోనే భూములు కేటాయించినట్టు పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన భూములు కేటాయించడమేగాక, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతినెలా ముఖ్యమంత్రి సమీక్షించారని చెప్పారు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, పనులను పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేశారని కొనియాడారు. ఆయా విద్యాసంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషిచేస్తామని లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News