Mallu Bhatti Vikramarka: కలెక్టర్‌పై కావాలనే బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి: మల్లు భట్టివిక్రమార్క
- కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారన్న డిప్యూటీ సీఎం
- పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాలన్న భట్టివిక్రమార్క
- దాడులు సమస్యలకు పరిష్కారం కాదన్న ఉపముఖ్యమంత్రి
లగచర్లలో కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంతో పోటీ పడగలదన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాలని, అందుకే పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
ఫార్మా సిటీ కోసం భూమి కోల్పోతున్న రైతుల బాధను తాము అర్థం చేసుకోగలమన్నారు. అందుకే వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అమాయక గిరిజనులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. కలెక్టర్, అధికారులపై దాడిని తాము ఖండిస్తున్నామన్నారు.
దాడులు సమస్యలకు పరిష్కారం కాదని గుర్తించాలన్నారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణకు పరిశ్రమలు రావడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేనట్లుగా ఉందని, అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అధికారులపై దాడులు చేస్తే వెనక్కి తగ్గుతామని భావిస్తున్నారేమో... కానీ అలా జరగదని స్పష్టం చేశారు. వారి కోసం అమాయక ప్రజలు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో కూడా అమాయకులను రెచ్చగొట్టి ప్రాణాలు తీశారని ఆరోపించారు.