Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం ముదిరితే పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఇదే!
- మెగా టోర్నీ ప్రభావితమైతే పీసీబీపై ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం
- ఐసీసీ ఫండింగ్‌ను తగ్గించే అవకాశాలు
- టోర్నీని వేరే దేశానికి తరలిస్తే పీసీబీకి 65 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే ఛాన్స్
- ఇటీవలే పలు స్టేడియాలను ఆధునికీకరించడంతో మరింత ఆర్థిక నష్టం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో టీమిండియాను అక్కడకు పంపించబోమని, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ కోరుతుండడం... అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విముఖంగా ఉండడం ఈ వివాదానికి మూల కారణంగా ఉంది. బీసీసీఐ అభిప్రాయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) ఐసీసీ అధికారికంగా తెలియజేసింది. భారత మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేలా ‘హైబ్రిడ్ మోడల్’పై అభిప్రాయం తెలియజేయాలంటూ ఒక అధికారిక ఈ-మెయిల్ పంపించి కోరింది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించడం ఇష్టంలేని పీసీబీ... బీసీసీఐ, ఐసీసీ వైఖరులను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరింది. దీంతో టోర్నీ నిర్వహణపై ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతోంది.
కాగా భారత్ విషయంలో మొండిగా వ్యవహరించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ప్రతికూల ప్రభావం పడేలా వ్యవహరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పలు విధాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఐసీసీ ఆంక్షలకు దారితీసే అవకాశం ఉంటుందని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. పీసీబీకి ఐసీసీ ఫండింగ్ గణనీయంగా తగ్గిపోవచ్చని పేర్కొంది. టోర్నమెంట్‌ను ఇతర దేశాలకు తరలించడం లేదా వాయిదా వేయాల్సి వస్తే పీసీబీ 65 మిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.548 కోట్లు) హోస్ట్ ఫీజును నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ ఇటీవలే కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో స్టేడియాలను ఆధునికీకరించింది. దీంతో మరింత ఆర్థిక నష్టం జరగనుంది. మరోపక్క, భద్రత విషయంలో ఎలాంటి ఢోకా లేదని, ఇటీవలే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించామని పీసీబీ చెబుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా భద్రత సమస్య ఉండదని ఐసీసీకి పీసీబీ తెలియజేసింది.